Tuesday 26 April, 2011

తెలుగు బ్లాగ్ కుటుంబంలోకి ఓ కొత్తబ్బాయి



తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారములు. ఎంతోకాలంగా తెలుగు బ్లాగ్స్ చదువుతున్నాను. ఇంతవరకూ అనేకమంది బ్లాగ్స్ లో ఎన్నెన్నో కవితలు, వ్యాసాలు చదివాను. అవి చదువుతుంటే నాకు కూడా ఏదైనా రాసెయ్యలనిపించేది. కానీ వాళ్ళ కవితాశక్తి, సృజనాత్మకత చూసి నాకేమీ రాదుకదా, నేనేం రాయగలను అని డీలా పడిపోయేవాడిని. కనీసం చదివిన బ్లాగ్స్ లో కామెంట్స్ పెట్టడానికి కూడా ధైర్యం చాలేదికాదు. ఈరోజెందుకో ఇక ఉండబట్టలేక బ్లాగ్ మొదలు పెట్టెయ్యాలనిపించింది. మరి ఏంరాద్దామా అని ఆలోచిస్తే.. నేను చదివే కొన్ని బ్లాగ్స్ గురించి రాద్దామనిపించింది. కానీ మళ్ళీ మనసు వెనక్కి లాగింది, బ్లాగ్స్ మీద రివ్యూ రాయడానికి నాకూ ఏంతోకంత రాసే శైలి ఉండాలికదా అని, అయినా తెలుగువాళ్ళకు అవతలివారి చిన్న చిన్న తప్పులని అమాయికత్వాన్ని చూసి హాయిగా నవ్వేసే గుణం ఉంటుందట. అందుకే ధైర్యం చేసేస్తున్నా.


నే చదివిన వాటిలో కొన్ని బ్లాగులు కోసం ఇప్పుడు రాస్తాను. మిగతావాటికోసం తరువాత పోస్ట్ లో వ్రాస్తాను.
ముందుగా మధురవాణిగారి బ్లాగ్..
ఎన్నెన్నో కథలు, కవితలతో భలే సరదాగా సాగిపోతుంటుంది. నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రవాహం అప్రతిహతంగా సాగుతూనే ఉంది. సున్నితంగా మనసుని తాకే కవితలుతో పాటు మా ఇంటబ్బాయ్ అంటూ మధురగారు చెప్పే కథలు ఎంతో బావుంటాయి. నీస్నేహం, కాలం ఒక మాయల మరాఠీ, వెన్నెల వాన, ఓ హేమంతపు రాతిరిలో పోస్ట్ లు సూపర్..రాశిబట్టి చూసినా వాశిబట్టి చూసినా మధురవాణిగారు ఎన్నదగిన పైస్థాయి తెలుగు బ్లాగర్లలో ఒకరనడంలో సందేహం లేదు.

నాకు చాలా బాగా నచ్చిన మరో బ్లాగ్... రాజన్ గారి నా...గోల. ఆయన రాసిన  మొత్తం పోస్ట్ లు చదివేసాను. ఆయన కవితల్లో భార్యాబాధితాష్టకం, దైవప్రార్థన, గమ్యం, ప్రియా..దరిజేరవా, ఆత్మపూజ, ప్రేమలోకం, విభజనపై విష్ణు తీర్పు కథ నాకు చాలా ఇష్టమైనవి. చాలా ఎత్తైన భావుకత ఆయనది. తేలిక మాటలతోనూ, క్లిష్టమైన మాటలతోనూ కూడా కవితలు రాయగల గొప్ప సృజనశీలి.  ముఖ్యంగా గమ్యం కవిత చివరకు వెళ్ళేకొద్దీ అద్భుతంగా అనిపించింది.


ఇంకా చాలామంది కవితలూ, వ్యాసాలు చదివా. అవన్నీ మెల్లిమెల్లిగా రాస్తాను.  బ్లాగు లోకంలో ఇప్పుడే పుట్టాను కాబట్టి కొద్దిగా అడుగులు తడబడుతూ ఉంటాయనుకుంటాను. అమూల్యమైన మీ సలహాలతో పొరపాట్లేవైనా ఉంటే దిద్దుకుంటాను, ఆశీర్వదించండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకూ సెలవు.